October 27, 2010

గీత

అతను మొన్న ఉదయాన్నే పోయాడు. ఎక్కడికో కాదు, మళ్ళీ తిరిగిరాలేని చోటుకే పోయాడు.అన్ని కార్యక్రమాలు నిన్ననే పూర్తి అయ్యాయి. కాయం కాలి బూడిద అయ్యింది. నేను చూస్తూనే ఉన్నాను, అతను తనతో ఏమీ తీసుకెళ్ళలేదు. మొన్న ఉదయం వరకూ చిన్న దెబ్బ తగిలినా బాధపడ్డ అతను, చిన్న సమస్య వచ్చినా బాగా అలోచించిన అతను, తన మెదడు, హృదయం కాలిపోతున్నా చలనం లేకుండా ఉండిపోయాడు. అతని ఆప్తుల హృదయాలు శోక సముద్రాలుగా మారినా, అతనిలో ఏ స్పందనా లేదు. జీవితంలో బాగా అలిసిపోయాడొ, లేక 'ఇక చాలు ' అనుకున్నాడొ ... తెలీదు.

సమాధి మీద శిలాఫలకం ఒకటి పెట్టారు. పేరు, జనన మరణాల తారీఖులు, తారీఖుల మధ్యన ఒక చిన్న గీత. జనన మరణాల మధ్యన ఉండేది ఏమిటి. జీవితమే కదా. అంటే అతని జీవితం అంతా కలిపి ఆ చిన్ని గీత అయ్యింది. ఇక్కడ బతికి ఉన్న వాళ్ళకే చోటు లేదు కాబట్టి అతను ఆ చిన్ని గీతాతో సరిపెట్టుకోవాలి, తప్పదు.

అతను పుట్టిన రోజునుంచి, మొన్న ఉదయం వరకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు. జీవితాన్ని కాలంతో కొలిచే వాళ్ళు వేసే లెక్కలు అవి. మరో కోణంలో ... అతనికి ఊహ తెలిసిన రోజు నుంచి మొన్న ఉదయంవరకు, అతని జీవితంలో ఎన్ని సంఘటనలు, ఎన్ని సరదాలు, సంతోషాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిరీక్షణలు, ఎన్ని నవ్వులు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని నిట్టూర్పులు, ఎన్ని విజయాలు, ఎన్ని పరాజయాలు, ఎన్ని పరిచయాలు, ఎన్ని పలకరింపులు, ఎన్ని బంధాలు, ఎందరు ఆత్మీయులు.

చిన్నప్పుడు ఎన్నిసార్లు అమ్మ చేతి గోరుముద్దలు తిన్నాడో. ఎన్నిసార్లు తండ్రితో కలిసి పక్క ఊరి తిరణాళ్ళకి వెళ్ళాడో. సరిగా చదివేవాడొ,లేదో. ఎన్ని సార్లు స్కూల్లో ఫస్ట్ వచ్చాడో, ఎన్ని సార్లు మాస్టారుతో దెబ్బలు తిన్నాడో. స్కూలు ఎగ్గొట్టి పొలాలలో షికారులు, రాత్రిళ్ళు గోడ దూకి వీధినాటకలకి వెళ్ళాటాలు, చెరువులో ఈతకొట్టటం, స్నేహితులతో కలిసి అల్లరి వేషాలు వెయ్యటం ... ఇలా ఎన్ని చేసాడో.

కాలేజీ కోసం వేరే ప్రాంతాలకి వెళ్ళాటం, కొత్త ప్రదేశాలు, కొత్త లోకం. కొత్త స్నేహితులు కొందరు, విడిపోయిన స్నేహితులు కొందరు. ఎన్ని సంబరాలో, ఎన్ని ఇబ్బందులో, కాలేజిలో ఎన్ని మెడల్స్ సాధించాడో, ఎన్ని సినిమాలు చూసాడో. ఉద్యోగపర్వంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని పోరాటాలు, ఆటుపోట్లు. వివాహం, పిల్లలు. ఎన్ని వేడుకలు చూసాడో, ఎన్ని వేడుకలు చేసాడో, ఎన్ని విహార యాత్రలు, ఎన్ని ప్రయాణాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని తగాదాలు, ఎన్ని స్నేహాలు. మనిషి అన్నాక కూతంత కళాపోషణ ఉంటుందిగా. చుట్టా, బీడీ, సిగరెట్టు, మందు, సంగీతం, సాహిత్యం, నాట్యం, వాయిద్యం ఇలా ఏదో ఒకటి చేసే ఉంటాడు.

ఎందరిని ఎంతగా అభిమానించాడో, ఎందరితో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని సార్లు ఇతరులకి అండగా నిలిచాడో, ఎన్ని కనీళ్ళు తుడిచాడో, ఎన్ని సార్లు ఆప్తులు అతనికి అండగా నిలిచారో, ఎన్ని సార్లు ఒంటరిగా వదిలేసిపోయారో, జీవితంలో ఎన్ని సంపదించుకున్నాడో, ఎన్ని కోల్పోయాడో. ఎన్ని విషయాలు ఇతరులతో పంచుకున్నాడో, ఎన్ని రహస్యాలు తనలో దాచుకున్నాడో. జీవితంలో ఎన్నో మార్పులు, ఆ మార్పుల వల్ల వచ్చే సంఘర్షణలు, ఎన్నొ అనుభూతులు ... ఇవన్నీ బూడిద అయిపోయిన ఆ మనసుకి మాత్రమే తెలుసు. అతనికి సంబంధించిన కొన్ని విషయలు అందరికి, మరి కొన్ని కేవలం కొందరు ఆప్తులకి మాత్రం తెలిసుంటాయి. ఆ విషయాలే కీర్తి శేషంగానో, అపకీర్తి శేషంగానో ఇక్కడ మిగిలిపోయాయి. ఇంత జీవితానికి కలిపి మిగిలింది ఒక చిన్న గీత.

సమాధిపైన శిలాఫలకం కొత్తది కదా, బాగా కళగా ఉంది. బహుశా బాగా చెయ్యి తిరిగిన శిల్పితో చేయించి ఉంటారు. శిలాఫలకం మీద గీత కూడా బాగా మెరుస్తోంది. అతని జననానికి, జీవితానికి కారణమయిన అతని నుదిటి రాతే, ఆ శిలఫలకం మీద గీత గా మారిందేమో.



July 19, 2010

సఖీ ...

నీకై నే సృష్టించిన నా ఊహా లోకంలో
కోయిలవై రాగాలు పలికించు

నీకై నే నిర్మించిన నా కలల సౌధంలో
కుసుమానివై సుగంధాలు వ్యాపించు

నీకై నే పాడుకునే పాటలో
రాగానివై మధురిమలు ఒలికించు

నీకై నే నాటిన ఆశల వనంలో
ఆమనివై చిగురులు పూయించు

నీకై నే నడిచి వచ్చు దారులలో
పిల్ల తెమ్మెరవై ఊసులు వినిపించు

నా జీవన యానంలో
బాసటవై అమృతాలు వర్షించు

June 11, 2010

భ్రాంతి

కొలను విరిసిన పద్మములని భ్రాంతి చెందినాను
తొలిసారి నీ కనులు చూసినపుడు

మబ్బువీడిన నెలవంక అని భ్రమపడినాను
తెరలు తొలగిన నీ మోము చూసినపుడు

నిన్ను చూసిన ఆ నిముషాన,
మేఘాలు మెరిసినట్టు, ఇంద్రధనుస్సు విరిసినట్టు
వసంతం వచ్చినట్టు, నా స్వాతంత్ర్యం పోయినట్టు...

నీ చూపుల గమ్మత్తులో నా దారి మరిచిపోయాను
నీ మాటల పరిమళాల మైమరిచిపోయాను

(దారి మరిచిపోయి ఎటో వెళ్ళిపోయిన నేను, ఇందాకే తిరిగి వచ్చాను)

May 18, 2010

చినుకు

నీ చినుకుల జడిలో తడిసిపోవాలని
ఆశగా మా వాకిట నిలుచుంటాను
నువ్వేమో మా ఇంటి సరిహద్దుల వరకే వర్షిస్తావు
ఏడడుగులు నడిచి వచ్చేలోగా వీధి చివరివరకు వెళ్ళిపోతావు

వడి వడిగా నడిచివచ్చి తల ఎత్తి చూస్తాను
నీ ఆఖరి చినుకైనా నా మీద వర్షిస్తావని
నా నుదుటిని చుంబిస్తావని

నింగిన కురిసి నేలరాలని చినుకవుతావు
రెప్పపాటు దూరంవరకు వచ్చి మాయమవుతావు
నన్ను నిరీక్షణలో ముంచిపోతావు

10/05/2010
11.15 PM