April 02, 2026

ఓ చైత్రమాసపు రాతిరి


చాలా రోజుల తరువాత, నిన్న - ఎన్నో సార్లు చదివిన ఓ తెలుగు పుస్తకం మళ్ళీ తెరిచాను.

"అమృతం కురిసిన రాత్రి"

దేవరకొండ బాలగంగధర్ తిలక్🙏
అతనిపై ఓరేయి అమృతం కురిసెనట
అతడు అమరుడు అయ్యేంతగా, ధారగా కురిసిందిట...

అతని జన్మజన్మాల పుణ్యమా,
లేక గంగాధరుడనే పక్షపాతమా?
ఏల కురిసెను అమృతము అతనిపైన

మా జనన కాలాలు వేరు అయినా,
జన్మభూమి కూత వేటు దూరమే కదా !

మరి నాపై ఎప్పుడూ ఒక్క అమృతపు బిందువైనను ఎందుకు పడలేదో !
గతజన్మ పాపాలు తరగలేదా
మా మధ్య కాలాన, అమృతమును అసురులు అపహరించినారా?
లేక, ఒక చుక్క అయినను మిగల్చక సురులు తాగివేసినారా?

అసలు, ఎన్నో నెలల తరువాత,
ఈ మండుటెండల చైత్రమాసపు రాతిరిలో
ఎప్పటినుండో నన్ను వెలి వేస్తున్న ఈ తెలుగు అక్షరాల సమాహారాన్ని
బాహ్యంతర రణగొణ ధ్వనుల మధ్య
ఇప్పుడు ఎందుకు తెరిచాను?

ఆలోచిస్తే స్ఫురించింది ... నిన్న పున్నమి
కాల మహిమ, హమయ్య - నా తప్పు కాదు
 
మేడ మీదకి వెళ్ళి చూసా ...
ఆకాశంలో జాబిలి, పుడమిపై వెన్నల కురిపిస్తూ ...

హర హరా
నా నామమున గంగ లేదు 😀

April 03, 2020

ఓయ్

రేయి-పగలు నీతలపులు మనసుని చుట్టుముట్టి
అల్లరి చేస్తుంటే, మనసు గాలిలో తేలుతూ ఉంటుంది

ప్రతి క్షణం నీ రూపం కనులెదుట కదులుతూ ఉంటుంది
గాలి కదలిక సైతం నీ పిలుపులా వినిపిస్తుంది

ఇంటి ముందర పూల వనం, నీ నవ్వులా కనపడుతుంది
ఏ అందెల చప్పుడైనా నీ అడుగుల సవ్వడిలా మురిపిస్తుంది

నీ పలుకు మధుర స్వరంలా సాగుతుంది
నీతో గడిపే సమయం దృశ్య కావ్యమై మదిలో పదిలమవుతుంది

February 10, 2020

కోపం

ఏ ఆలోచనా లేని మనసులో
ఏ ఆలోచనా రానంతగా నిండిపోయావనే చిరు కోపంతో ...

చూడకే నన్నలా చినదానా
నే తేలిపోతానిలా గాలిలోన

సూర్యచంద్రులా కాంతులేమో ఆ కళ్ళలోన
మాటిమాటికి గుచుకుంటాయి నా గుండెలోన

August 01, 2017

ఎవరో

అలవో
చిలిపి తలపుల వలవో

కలత నిదురలో కరిగే కలవో
గుండె సడివో

కురిసే వర్షపు జడివో
సేద తీర్చు ఒడివో

తొలి సంధ్య మంచు తడివో
మలి సంధ్య చలి గాలి గిలివో

ఉరికేటి సెలయేటి వడివో
నాలో ఈ కొత్త ఒరవడివో

ఎవరో
నీవెవరో

February 03, 2015

రేపటి కోసం

మొన్న మొన్నటి దాకా పిల్ల వాగులా కదిలి
నిన్నటి వరకు మహోధృతమైన నదిలా ఉరకెలెత్తి
నేడు, ఘనీభవించి హిమఖండముగా మారిన నేను,
నిను చేరే రోజుకోసం ఎదురుచూస్తూ ...

November 09, 2013

నా లోకం

చెలీ,

ఏ వెలుగూ వెలుతురు ఇవ్వని
చిక్కని చీకటిలా కమ్ముకున్న ప్రేమ నీవు


అంధకారమే అయినా
అనిర్వచనీయమైన హాయి నీవు


అంతులేని ఈ చీకటి లోకంలో
ధగధగా మెరుస్తున్న అనంతమైన నల్లని తారలన్నీ
నీకు నేరాసిన ప్రేమలేఖలు
గాలి తెమ్మెరలన్నీ
నువ్వు నాకు చెప్పే ఊసులు


శబ్దం చేయని నీ ఊసులు
నాకు తప్ప ఎవరికీ వినిపించవు
చీకటి తెరపై నేరాసిన లేఖలు
నీకు తప్ప వేరొకరికి కనిపించవు



 

July 30, 2012

యుగం

క్షణాలు, నిమిషాలు, గంటలు
రోజులు, వారాలు, నెలలు
సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలంటూ
కాలాన్ని రకరకాలుగా లెక్కిస్తారు కానీ చెలీ,
యుగమొక్కటే నాకు అర్ధమయ్యే కాల ప్రమాణం.
నీ పిలుపుకై నేను నిరీక్షించే కాలంలో, 
అది అణువంత పరిమాణం.

March 12, 2012

నువ్వుంటే...

కళ్ళకి గంతలే కడతావో,
కనికట్టే చేస్తావో

నువ్వుంటే జీవితం కమ్మని కలలా సాగిపోతుంది
లేకుంటే కదిలే బొమ్మల కొలువులా మారిపోతుంది

నువ్వుంటే మనసు గాలిలో తేలిపోతుంది
లేకుంటే గుబులుతో గుండె భారమైపోతుంది

నువ్వులేని చోటు కోసం లోకమంతా వెతుకుతుంటాను
ప్రతిచోటా నిన్ను చూసి నాలో నేను నవ్వుకుంటాను

నువ్వు ఉన్నంతసేపు, నీ మాయలో పడి తిరుగుతుంటాను
నువ్వు లేనప్పుడు, నీ మాయ తొలగి
ఈ మాయా ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటాను

January 13, 2012

శాశ్వతం

నీవు నడిచేది నీటిపైన కాదు
అలలతో అడుగులు కదిలిపోవటానికి

నేలపైన కాదు
జాడలు చెరిగిపోవటానికి

నింగిలో కాదు
మబ్బులా చెదిరిపోయటానికి

చెలీ,
నీవు నా హృదయసీమలో తిరుగాడుతావు
అడుగడుగునా నీ గుర్తులు నింపి శాశ్వతమైపోయావు

October 11, 2011

నీకోసం

నీకోసం నా మనసు ముంగిట
ప్రేమ కవితలు పూయించాను

నా మనోఫలకాన
నీరూపాన్ని మనోహరంగా చిత్రించాను

నా అంతరంగాన అణువణువులోన
నిన్ను నింపుకున్నాను

నాగుండె లోయలు ప్రతిధ్వనించేలా
నీపేరే పాటగా పాడుతున్నాను

నువ్వు వచ్చి జీవితాన వెలుగులు నింపుతావని
వేయికళ్ళతో ఆశగా ఎదురుచూస్తూ
ఇలా వాకిట నిలుచున్నాను

September 29, 2011

ఎదురుచూపు

సఖీ,

నీతో నేనడిచిన దారులలో
ఒంటరిగా పాదం అడుగుపడనీయదు
ఆగిపోదామంటే కాలం ఆగనీయదు

ఎంత వారిస్తున్నా
నా మనసు నిన్ను స్మరిస్తూనే ఉంటోంది
ఏ ఆలోచనైనా నీవైపుకే పరుగుతీస్తోంది

కోరిన వరమై మురిపిస్తావో
తీరని శాపమై వేధిస్తావో
నీ ఇష్టం

నెలలు సంవత్సరాలే కాదు
ఎన్ని జీవిత కాలాలైనా నీ జ్ఞాపకాలతో గడిపేస్తాను
ఎప్పటికీ నీకోసం ఎదురుచూస్తూనే ఉంటాను

October 27, 2010

గీత

అతను మొన్న ఉదయాన్నే పోయాడు. ఎక్కడికో కాదు, మళ్ళీ తిరిగిరాలేని చోటుకే పోయాడు.అన్ని కార్యక్రమాలు నిన్ననే పూర్తి అయ్యాయి. కాయం కాలి బూడిద అయ్యింది. నేను చూస్తూనే ఉన్నాను, అతను తనతో ఏమీ తీసుకెళ్ళలేదు. మొన్న ఉదయం వరకూ చిన్న దెబ్బ తగిలినా బాధపడ్డ అతను, చిన్న సమస్య వచ్చినా బాగా అలోచించిన అతను, తన మెదడు, హృదయం కాలిపోతున్నా చలనం లేకుండా ఉండిపోయాడు. అతని ఆప్తుల హృదయాలు శోక సముద్రాలుగా మారినా, అతనిలో ఏ స్పందనా లేదు. జీవితంలో బాగా అలిసిపోయాడొ, లేక 'ఇక చాలు ' అనుకున్నాడొ ... తెలీదు.

సమాధి మీద శిలాఫలకం ఒకటి పెట్టారు. పేరు, జనన మరణాల తారీఖులు, తారీఖుల మధ్యన ఒక చిన్న గీత. జనన మరణాల మధ్యన ఉండేది ఏమిటి. జీవితమే కదా. అంటే అతని జీవితం అంతా కలిపి ఆ చిన్ని గీత అయ్యింది. ఇక్కడ బతికి ఉన్న వాళ్ళకే చోటు లేదు కాబట్టి అతను ఆ చిన్ని గీతాతో సరిపెట్టుకోవాలి, తప్పదు.

అతను పుట్టిన రోజునుంచి, మొన్న ఉదయం వరకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు. జీవితాన్ని కాలంతో కొలిచే వాళ్ళు వేసే లెక్కలు అవి. మరో కోణంలో ... అతనికి ఊహ తెలిసిన రోజు నుంచి మొన్న ఉదయంవరకు, అతని జీవితంలో ఎన్ని సంఘటనలు, ఎన్ని సరదాలు, సంతోషాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిరీక్షణలు, ఎన్ని నవ్వులు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని నిట్టూర్పులు, ఎన్ని విజయాలు, ఎన్ని పరాజయాలు, ఎన్ని పరిచయాలు, ఎన్ని పలకరింపులు, ఎన్ని బంధాలు, ఎందరు ఆత్మీయులు.

చిన్నప్పుడు ఎన్నిసార్లు అమ్మ చేతి గోరుముద్దలు తిన్నాడో. ఎన్నిసార్లు తండ్రితో కలిసి పక్క ఊరి తిరణాళ్ళకి వెళ్ళాడో. సరిగా చదివేవాడొ,లేదో. ఎన్ని సార్లు స్కూల్లో ఫస్ట్ వచ్చాడో, ఎన్ని సార్లు మాస్టారుతో దెబ్బలు తిన్నాడో. స్కూలు ఎగ్గొట్టి పొలాలలో షికారులు, రాత్రిళ్ళు గోడ దూకి వీధినాటకలకి వెళ్ళాటాలు, చెరువులో ఈతకొట్టటం, స్నేహితులతో కలిసి అల్లరి వేషాలు వెయ్యటం ... ఇలా ఎన్ని చేసాడో.

కాలేజీ కోసం వేరే ప్రాంతాలకి వెళ్ళాటం, కొత్త ప్రదేశాలు, కొత్త లోకం. కొత్త స్నేహితులు కొందరు, విడిపోయిన స్నేహితులు కొందరు. ఎన్ని సంబరాలో, ఎన్ని ఇబ్బందులో, కాలేజిలో ఎన్ని మెడల్స్ సాధించాడో, ఎన్ని సినిమాలు చూసాడో. ఉద్యోగపర్వంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని పోరాటాలు, ఆటుపోట్లు. వివాహం, పిల్లలు. ఎన్ని వేడుకలు చూసాడో, ఎన్ని వేడుకలు చేసాడో, ఎన్ని విహార యాత్రలు, ఎన్ని ప్రయాణాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని తగాదాలు, ఎన్ని స్నేహాలు. మనిషి అన్నాక కూతంత కళాపోషణ ఉంటుందిగా. చుట్టా, బీడీ, సిగరెట్టు, మందు, సంగీతం, సాహిత్యం, నాట్యం, వాయిద్యం ఇలా ఏదో ఒకటి చేసే ఉంటాడు.

ఎందరిని ఎంతగా అభిమానించాడో, ఎందరితో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని సార్లు ఇతరులకి అండగా నిలిచాడో, ఎన్ని కనీళ్ళు తుడిచాడో, ఎన్ని సార్లు ఆప్తులు అతనికి అండగా నిలిచారో, ఎన్ని సార్లు ఒంటరిగా వదిలేసిపోయారో, జీవితంలో ఎన్ని సంపదించుకున్నాడో, ఎన్ని కోల్పోయాడో. ఎన్ని విషయాలు ఇతరులతో పంచుకున్నాడో, ఎన్ని రహస్యాలు తనలో దాచుకున్నాడో. జీవితంలో ఎన్నో మార్పులు, ఆ మార్పుల వల్ల వచ్చే సంఘర్షణలు, ఎన్నొ అనుభూతులు ... ఇవన్నీ బూడిద అయిపోయిన ఆ మనసుకి మాత్రమే తెలుసు. అతనికి సంబంధించిన కొన్ని విషయలు అందరికి, మరి కొన్ని కేవలం కొందరు ఆప్తులకి మాత్రం తెలిసుంటాయి. ఆ విషయాలే కీర్తి శేషంగానో, అపకీర్తి శేషంగానో ఇక్కడ మిగిలిపోయాయి. ఇంత జీవితానికి కలిపి మిగిలింది ఒక చిన్న గీత.

సమాధిపైన శిలాఫలకం కొత్తది కదా, బాగా కళగా ఉంది. బహుశా బాగా చెయ్యి తిరిగిన శిల్పితో చేయించి ఉంటారు. శిలాఫలకం మీద గీత కూడా బాగా మెరుస్తోంది. అతని జననానికి, జీవితానికి కారణమయిన అతని నుదిటి రాతే, ఆ శిలఫలకం మీద గీత గా మారిందేమో.



July 19, 2010

సఖీ ...

నీకై నే సృష్టించిన నా ఊహా లోకంలో
కోయిలవై రాగాలు పలికించు

నీకై నే నిర్మించిన నా కలల సౌధంలో
కుసుమానివై సుగంధాలు వ్యాపించు

నీకై నే పాడుకునే పాటలో
రాగానివై మధురిమలు ఒలికించు

నీకై నే నాటిన ఆశల వనంలో
ఆమనివై చిగురులు పూయించు

నీకై నే నడిచి వచ్చు దారులలో
పిల్ల తెమ్మెరవై ఊసులు వినిపించు

నా జీవన యానంలో
బాసటవై అమృతాలు వర్షించు

June 11, 2010

భ్రాంతి

కొలను విరిసిన పద్మములని భ్రాంతి చెందినాను
తొలిసారి నీ కనులు చూసినపుడు

మబ్బువీడిన నెలవంక అని భ్రమపడినాను
తెరలు తొలగిన నీ మోము చూసినపుడు

నిన్ను చూసిన ఆ నిముషాన,
మేఘాలు మెరిసినట్టు, ఇంద్రధనుస్సు విరిసినట్టు
వసంతం వచ్చినట్టు, నా స్వాతంత్ర్యం పోయినట్టు...

నీ చూపుల గమ్మత్తులో నా దారి మరిచిపోయాను
నీ మాటల పరిమళాల మైమరిచిపోయాను

(దారి మరిచిపోయి ఎటో వెళ్ళిపోయిన నేను, ఇందాకే తిరిగి వచ్చాను)

May 18, 2010

చినుకు

నీ చినుకుల జడిలో తడిసిపోవాలని
ఆశగా మా వాకిట నిలుచుంటాను
నువ్వేమో మా ఇంటి సరిహద్దుల వరకే వర్షిస్తావు
ఏడడుగులు నడిచి వచ్చేలోగా వీధి చివరివరకు వెళ్ళిపోతావు

వడి వడిగా నడిచివచ్చి తల ఎత్తి చూస్తాను
నీ ఆఖరి చినుకైనా నా మీద వర్షిస్తావని
నా నుదుటిని చుంబిస్తావని

నింగిన కురిసి నేలరాలని చినుకవుతావు
రెప్పపాటు దూరంవరకు వచ్చి మాయమవుతావు
నన్ను నిరీక్షణలో ముంచిపోతావు

10/05/2010
11.15 PM

July 18, 2009

అమ్మ

అమ్మ
వంట ఇంటిలోన అమ్మ ఉంటుంది
ఎప్పుడూ ఎదో ఒకటి చేస్తూ ఉంటుంది

నిదుర లేచింది మొదలు
నిదుర పోయేంత వరకు
వంట ఇంటిపైనే ఆమె ధ్యాసంతా

ఉదయాన్నే ...
పాలు కాచాలంటుంది
కాఫీ కలపాలంటుంది
వంటింటికేసి వడివడిగా అడుగులేస్తుంది

వేడి వేడి దోశలు రెడీ అంటుంది
వాటికి కమ్మని చట్నీ జత చేస్తుంది

ఆపై,
ఘుమఘుమల వంటకాలు చేస్తుంది
తిన్నాక నిద్ర ముంచుకొస్తుంది

సంధ్య వేళ నిద్ర లేచేసరికి ...
వంట ఇంటిలోన అమ్మ ఉంటుంది
ఎదో ఒకటి చేస్తూ ఉంటుంది

కాసేపు కూర్చో అమ్మా అంటే,
పప్పు రుబ్బాలంటుంది, కూర తరగాలంటుంది
వంట చేయాలంటుంది, వంటింటిలోనే ఉండిపోతుంది

వంటచేసి ఎరుగదు ఏనాడు ఆమె చిన్ననాడు
ఆలోటు తీర్చేందుకే కాబోలు
వంటిల్లు విడిచిరాలేదు ఈనాడు

వంట ఇల్లు ఆమె సామ్రాజ్యము
వంట ఇల్లే ఆమె సర్వస్వము

వంట ఇంటిలోన అమ్మ ఉంటుంది
ఎప్పుడూ ఎదో ఒకటి చేస్తూ ఉంటుంది

November 08, 2008

స్మృతి

నా స్మృతి పధంలోని ప్రతి మలుపులో
నీవే ఎదురై, అడ్డుపడుతుంటావు
ఏ పనీ చేయనీకుండా అడ్డుకుంటావు

నీకిది భావ్యమా అని అడుగుతుంటే,
అదోలా చూస్తావు నా కళ్ళలోకి . . . .
నన్ను తోసివేస్తావు నీ జ్ఞాపకాల అగాధాలలోకి.
ఇట్లు,
నేను
(నీ జ్ఞాపకాల అగాధాల లోతుల నుంచి)

August 09, 2008

వానకి ఓ వందనం

రెండు రోజులుగా,
జోరు జోరుగా వాన - హొరు హొరున వాన

ఊరంతా వాగులయ్యేంతగా వాన
వరదలా ఉప్పొంగిన వాన

వానా వానా, ముంచెత్తే వానా
చినుకు పడితే చాలు చిత్తడైపోయే మా ఊరిలోన
చెలరేగిపోయాతావెందుకే వానా

నెలల తరబడి ముఖం చాటేస్తావే వానా
ఆకలి మంటలు రగిలిస్తావే వానా
జాలి లేదా నీకు వానా

వస్తేనేమో,
వాగు వంకలు నింపి, నదుల గట్లు తెంపి
ఊళ్ళే మింగేస్తావు వానా - అంత ఆకలా నీకు వానా

నువ్వు లేకుంటే, తినగ మెతుకుండదే వానా
నువ్వు వస్తే, అడుగు బయటపెట్టే వీలుండదే వానా
ఇలా, అతి చేస్తావెందుకే మతిలేని దానా
నీ రూపు నాజూకు వానా, కానీ
నీకు హృదయమే లేదు కాబోలు వానా

(ఇలా అన్నానని ఏమీ అనుకోకే వానా ... మరి నిన్నా, ఈరోజు ఏక ధాటిగా కురిసి, నువ్వు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టావుగా, అందుకని కోపమొచ్చి అలా రాసాను.)
ఇట్లు,
నీ నేను
హైదరాబాద్
Aug 9th, 2008

July 27, 2008

ఏమి మాయ చేసావో ...

నా గుండె సవ్వడి
నాలోని అలజడి
మునుపెన్నడు లేదిది
నాకంతా వింతగా ఉన్నది

ఎప్పుడు తూరుపు తెలవారిందో
ఎప్పుడు ఆకాశం నల్లరంగు పులుముకుందో

పగలేదో, రేయేదో
తెలియకనే రోజు గడిచిపోతున్నది
ఏమి మాయ చేసావో ...

నిద్దురలో కలలా కమ్ముకుంటావు
పగలైతే అంతా నీవై కనపడతావు
కల ఏదో, నిజమేదో తెలియకుండా చేసావు

నీతలపుల చినుకులలో నన్ను తడిపివేసావు

July 14, 2008

వయ్యారి జుట్టు

ప్రతి అమ్మాయి తన జుట్టు గురించి బహుశా ఇలాగే అనుకుంటుందేమో ...

నిగనిగల జుట్టు, నల్లని జుట్టు
వయ్యారాల జుట్టు, వగలుపోవు జుట్టు
*************************
నిద్దురలో మెత్తగా నా మోమును కౌగిలించుకునే జుట్టు
చిక్కుపడి చికాకు పెట్టు ఈ జుట్టు
*************************
తలస్నానం చేస్తే త్వరగా తడి ఆరని జుట్టు
తడిగా ముడి వేస్తే తలనొప్పి ఈ జుట్టు
***************************
అద్దం ముందు నిలబడి ముస్తాబు అయ్యేవేళ
ఈ అందం నావల్లనే అంటూ గుసగుసలాడు జుట్టు
********************************
మూడు పాయలు చేసి ముచ్చటగ జెడవేసుకొను జుట్టు
పూలు సిగలో తురుమ బహు సుందరం నాజుట్టు
********************************
జడగంటలు పెట్టుకుని సందడిగా తిరుగుతుంటే
'ఎవరీ అపరంజి బొమ్మ ' అని అందరూ అంటుంటే
మురిసి మురిపెంగా నేను ముద్దు చేయు నా జుట్టు
**********************************
చిరుగాలితో సయ్యాట ఈ జుట్టు
నా నడకతో నాట్యమాడు నా జుట్టు
*********************************
నిగనిగల జుట్టు, నల్లని జుట్టు
వయ్యారాల జుట్టు, వగలుపోవు నాజుట్టు
---------------------------------------------
Photoes: Courtesy - Baapu garu