May 09, 2007

వెన్నెల వెలుగులు

ప్రియతమా,
ఎన్ని వెన్నెల సాయంకాలాలు కలిసి గడిపామో కదా మనం !

వెన్నెల వెలుగులు చూసిన ప్రతిసారీ పరవశించిపొయేవాడిని
వెన్నెలకెంత మహిమో కదా అని ఆశ్చర్యపడేవాడిని

వెన్నెల అవనికి అందాలనద్దే అద్భుత దృశ్యం చూస్తూ మైమరచిపోయేవాడిని.
అలా ఎంత కాలం గడిచిందో ...
నెలలు, సంవత్సరాలు క్షణాలుగా కదిలిపోయాయి
అందమైన జ్ఞాపకాలను ఎన్నో మన గుండెల్లో నింపుతూ.

నిన్న పౌర్ణమి సాయంత్రం,
ప్రతిసారీ మనం కలిసే ప్రదేశమే,
ఒక్కటే తేడా....

నీవు లేవు, ఒంటరిగా నేను.

ఎంతసేపు ఎదురు చూసానో,
చందమామ వచ్చాడు గానీ, వెన్నెల వెలుగులు లేవు
ప్రకృతి మూగబోయిందా అన్నట్టు నా చుట్టూ ఏ చైతన్యమూ లేదు

వెలవెలపోతున్న ఆ వెన్నెలను చూసాకే నాకు అర్ధమయ్యింది
ఇంతకాలం ప్రతి సాయంత్రం నేను చూసిన వెలుగులు వెన్నెలవు కావనీ ..
ఆ వెలుగులన్నీ నీవల్లే అని
అంతా నీ నవ్వుల మాయే అని.

----------
బాలు.౧౯ జూలై ౨౦౦౬

నాలో నేను

నాలో నేను, నాలోనే నేను

ఏవో జ్ఞాపకాలు అలలుగా నన్ను తాకుతుండగా
ఆకారం లేని ఆకృతులు, ఏవో ఊసులు నా చెవిలో చెప్తుండగా
నాలో నేను, నాలోనే నేను

గాలి కెరటాలతో అలా ఎగిరిపోవాలని
పూలతోటలోని ప్రతి పువ్వులో ఒదిగిపొవాలని
హద్దు తెలియని అనంత సాగరంలో ఓ బిందువు కావాలని

అనుకుంటూ ...
నాలో నేను, నాలోనే నేను

ఏకాంతాన విహరించాలనిప్రకృతి ఒడిలో నిదురించాలని
ప్రపంచానికి ప్రేమ పంచాలని ప్రేమ వాహినిలో కరిగిపోవాలని
అనుకుంటూ ...
నాలో నేను, నాలో నేను లేను.

-------
బాలు
౧౩.౧౨.౨౦౦౬, మ. ౧.౪౫