October 12, 2007

నీ స్నేహం

నేస్తమా,
ప్రతి ఉషోదయం నన్ను తట్టిలేపి
నాలో కొత్త ఆశలు రేపునది, నీ స్నేహం
నాలో చైతన్యానికి ఊపిరి, నీ స్నేహం
సంతోషపు పరిమళాల పూలవనం, నీ స్నేహం
నా బలం బలహీనతా, నీ స్నేహం
ఎన్ని రోజులైనా ప్రతి రోజూ సరికొత్త అనుభూతి, నీ స్నేహం
మరణవేళ సైతం మరువలేని మధుర కావ్యం, కావాలి మన స్నేహం
ఇట్లు,
నీ బాలు. ౧౯.౦౭.౨౦౦౭, పగలు ౨.౪౮

పూలు

ఈ పూలు వాడిపోవచ్చు,
పూలపరిమళం తగ్గిపోవచ్చు
కానీ నేస్తమా,
ఈ పూలను అందించిన నా చెయ్యి
ఎప్పట్టికీ నిన్ను పట్టినడిపిస్తుంది
నా మనసు నీకెప్పుడూ తోడుగా ఉంటుంది
నీ స్నేహం కురిపించే పరిమళం నా గుండెల్లో పదిలంగా ఉంటుంది
ఇట్లు,
నీ బాలు ౦౩.౦౮.౨౦౦౭, సాయంత్రం ౬. ౫౦

నీలి ఆకాశమా

నీలి ఆకాశమా,
నీకు నిదుర రాదా ఏమి?
ఏప్పుడూ మేల్కొనే ఉంటావు
విమానాల రొదకు నిదుర రాదు కాబోలు

వేరే చోటుకి వెళ్ళలేవా ఏమి?
ఎప్పుడూ అక్కడే నిలిచి ఉంటావు

వేరే పని లేదా నీకు?
నా వైపే చూస్తూ ఉంటావు

మేఘాలతో కుదురుగా ఆడుకోక
ఉరుములతో గొడవ చేస్తావెందుకు?
మీ అమ్మ తిట్టదా నిన్ను

అమావాస్య రోజులలో
ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ వెలుగూ లేనప్పుడు
భయమేయదా నీకు

నాకు నీతో స్నేహం చేయాలని ఉంటుంది
కానీ, నీవా నాదరికి రాలేవు
నేనేమో నీ ఎత్తుకి ఎగరలేను
ఏం చేయను ?

మరచిపోకు నేస్తం నన్ను
వాన చినుకులనే నీ సందేశం కోసం
ఎదురుచూస్తూ ఉంటాను.

ఇట్లు
నీ బాలు

హమ్మయ్య

హమ్మయ్య ! వచ్చావా ...

నువ్వు నా కనుల ముందు నుంచి కదిలిన క్షణం నుండీ
నా చూపు నీ వెంటే పరిగెడుతూ వస్తుంది
నువ్వు కనుచూపు మేరలో ఉన్నంతవరకు.

ఆ పైన నాలో ఒకటే అలజడి
ఏదో తొందర, అంతా గడబిడ
కనురెప్ప వేయటం కూడా మరచి,
నువ్వు వెళ్ళిన దారివైపే చూస్తూ ఎదురుచూపు ...
నువ్వు తిరిగి వచ్చేంతవరకు.

ఇది అంతా నీ కోసం కాదులే ...
నీకోసమే పరితపించే నా మనసుకోసం

ఇట్లు,
నీ బాలు ౨౦.౦౭.౨౦౦౭, పగలు ౩.౧౦

నేను

చీమ ఒళ్ళు విరుచుకున్నా భయంకర శబ్దం వినిపించే
మహా నిశబ్దం నేను
మహా ప్రళయాల చెవులు చిల్లులుపడే
భయంకర నాదం నేను

చిరునవ్వులు కురిపించే సంతోషాన్ని నేను
అయినా, అప్పుడప్పుడూ బాధగా ఉంటాను

సరదాలను నేను, సంగీతాన్ని నేను
హుషారు నేను, అయినా దిగులుగా నేను

చైతన్యాన్ని నేను, జడత్వాన్ని నేను
కాంతిపుంజాల రూపం నేను,
అయినా అప్పుడప్పుడూ చీకటిలో ఉండిపోతాను

ఉరకలెత్తే సెలయేటిని నేను, అప్పుడప్పుడూ సొమ్మసిల్లిపోతుంటాను
ప్రేమను పంచుతుంటాను, వేదనని నాలోనే దిగమింగుతుంటాను
పరిమళల పూలవనం నేను, మోడును నేను
కోకిల పాటను నేను, గార్ధబ గానం నేను
మాటను నేను, మౌనం నేను

గగనమంత విశాలంగా నేను, అణువంత ఇరుకుగా నేను
తీరాల అలల తాకిడి నేను, సముద్రగర్భాన నిశ్చలం నేను

జీవం నేను
మరణం నేను


ఇట్లు,
నీ బాలు. ౨౧/౯/౦౭, సాయంత్రం ౬.౫౨

July 23, 2007

ఒంటరిగా

సరదాలు సంతోషాలు, మనసులోని భావాలు
పంచుకునే వారులేక మౌనంగా ఉండిపోయినప్పుడు,
ఆలోచనల జడిలో తడిసిపోయినప్పుడు,
ఏ ఆలోచనలూ లేక, శూన్యంలోకి చూస్తూ ఉండిపోయినప్పుడు,
ఏం ఆలోచిస్తున్నానో కూడా తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడినప్పుడు,
కన్నీళ్ళు కంటి లోతుల్లో దాగి, మనస్సు పోరలలో మంటలు రగిలినప్పుడు,

కంటిలో తడితెరలు కదిలినప్పుడు...మసక చీకట్లు కమ్మినప్పుడు,
బాధ గుండెను అదిమి, గొంతు పెగలక ఊపిరాడనప్పుడు,

కన్నీళ్ళు నన్ను వదిలిపోయినపుడు,
కన్నీళ్ళని వానజడిలో దాచుకుని ఏడ్చినపుడు

ఒంటరిగా నేను,
ఒంటరినై నేను,
ఒంటరినే నేను.

ఇట్లు,
నీ బాలు
౨౭.౦౬.౨౦౦౭, పగలు ౦౪.౦౦

May 09, 2007

వెన్నెల వెలుగులు

ప్రియతమా,
ఎన్ని వెన్నెల సాయంకాలాలు కలిసి గడిపామో కదా మనం !

వెన్నెల వెలుగులు చూసిన ప్రతిసారీ పరవశించిపొయేవాడిని
వెన్నెలకెంత మహిమో కదా అని ఆశ్చర్యపడేవాడిని

వెన్నెల అవనికి అందాలనద్దే అద్భుత దృశ్యం చూస్తూ మైమరచిపోయేవాడిని.
అలా ఎంత కాలం గడిచిందో ...
నెలలు, సంవత్సరాలు క్షణాలుగా కదిలిపోయాయి
అందమైన జ్ఞాపకాలను ఎన్నో మన గుండెల్లో నింపుతూ.

నిన్న పౌర్ణమి సాయంత్రం,
ప్రతిసారీ మనం కలిసే ప్రదేశమే,
ఒక్కటే తేడా....

నీవు లేవు, ఒంటరిగా నేను.

ఎంతసేపు ఎదురు చూసానో,
చందమామ వచ్చాడు గానీ, వెన్నెల వెలుగులు లేవు
ప్రకృతి మూగబోయిందా అన్నట్టు నా చుట్టూ ఏ చైతన్యమూ లేదు

వెలవెలపోతున్న ఆ వెన్నెలను చూసాకే నాకు అర్ధమయ్యింది
ఇంతకాలం ప్రతి సాయంత్రం నేను చూసిన వెలుగులు వెన్నెలవు కావనీ ..
ఆ వెలుగులన్నీ నీవల్లే అని
అంతా నీ నవ్వుల మాయే అని.

----------
బాలు.౧౯ జూలై ౨౦౦౬

నాలో నేను

నాలో నేను, నాలోనే నేను

ఏవో జ్ఞాపకాలు అలలుగా నన్ను తాకుతుండగా
ఆకారం లేని ఆకృతులు, ఏవో ఊసులు నా చెవిలో చెప్తుండగా
నాలో నేను, నాలోనే నేను

గాలి కెరటాలతో అలా ఎగిరిపోవాలని
పూలతోటలోని ప్రతి పువ్వులో ఒదిగిపొవాలని
హద్దు తెలియని అనంత సాగరంలో ఓ బిందువు కావాలని

అనుకుంటూ ...
నాలో నేను, నాలోనే నేను

ఏకాంతాన విహరించాలనిప్రకృతి ఒడిలో నిదురించాలని
ప్రపంచానికి ప్రేమ పంచాలని ప్రేమ వాహినిలో కరిగిపోవాలని
అనుకుంటూ ...
నాలో నేను, నాలో నేను లేను.

-------
బాలు
౧౩.౧౨.౨౦౦౬, మ. ౧.౪౫

April 16, 2007

తరలి రాదా తనే వసంతం

నీ నవ్వులు

ప్రతీ క్షణం నీ నవ్వు రత్నాలను అందుకుటూ
నా మది గదిలో పదిలముగా దాచుకుంటున్నాను
నీ నవ్వుల రాశులకు నేను అధిపతినని
నాలో నేను గర్వపడుతుంటాను

నీ నవ్వుల జల్లులు ఎప్పటికీ
నాపై కురుస్తూనే ఉండాలని అనుక్షణం కోరుకుంటూ ఉంటాను.
అప్పుడప్పుడు అలజడులు సహజమే
దాటుకుంటూ వెళ్ళిపోదాం
నీ బాధలను నాకు ఇచ్చి
హయిగా నవ్వుతూ నువ్వు నాతోనే ఉండు