October 12, 2007

నీ స్నేహం

నేస్తమా,
ప్రతి ఉషోదయం నన్ను తట్టిలేపి
నాలో కొత్త ఆశలు రేపునది, నీ స్నేహం
నాలో చైతన్యానికి ఊపిరి, నీ స్నేహం
సంతోషపు పరిమళాల పూలవనం, నీ స్నేహం
నా బలం బలహీనతా, నీ స్నేహం
ఎన్ని రోజులైనా ప్రతి రోజూ సరికొత్త అనుభూతి, నీ స్నేహం
మరణవేళ సైతం మరువలేని మధుర కావ్యం, కావాలి మన స్నేహం
ఇట్లు,
నీ బాలు. ౧౯.౦౭.౨౦౦౭, పగలు ౨.౪౮

పూలు

ఈ పూలు వాడిపోవచ్చు,
పూలపరిమళం తగ్గిపోవచ్చు
కానీ నేస్తమా,
ఈ పూలను అందించిన నా చెయ్యి
ఎప్పట్టికీ నిన్ను పట్టినడిపిస్తుంది
నా మనసు నీకెప్పుడూ తోడుగా ఉంటుంది
నీ స్నేహం కురిపించే పరిమళం నా గుండెల్లో పదిలంగా ఉంటుంది
ఇట్లు,
నీ బాలు ౦౩.౦౮.౨౦౦౭, సాయంత్రం ౬. ౫౦

నీలి ఆకాశమా

నీలి ఆకాశమా,
నీకు నిదుర రాదా ఏమి?
ఏప్పుడూ మేల్కొనే ఉంటావు
విమానాల రొదకు నిదుర రాదు కాబోలు

వేరే చోటుకి వెళ్ళలేవా ఏమి?
ఎప్పుడూ అక్కడే నిలిచి ఉంటావు

వేరే పని లేదా నీకు?
నా వైపే చూస్తూ ఉంటావు

మేఘాలతో కుదురుగా ఆడుకోక
ఉరుములతో గొడవ చేస్తావెందుకు?
మీ అమ్మ తిట్టదా నిన్ను

అమావాస్య రోజులలో
ఒంటరిగా ఉన్నప్పుడు, ఏ వెలుగూ లేనప్పుడు
భయమేయదా నీకు

నాకు నీతో స్నేహం చేయాలని ఉంటుంది
కానీ, నీవా నాదరికి రాలేవు
నేనేమో నీ ఎత్తుకి ఎగరలేను
ఏం చేయను ?

మరచిపోకు నేస్తం నన్ను
వాన చినుకులనే నీ సందేశం కోసం
ఎదురుచూస్తూ ఉంటాను.

ఇట్లు
నీ బాలు

హమ్మయ్య

హమ్మయ్య ! వచ్చావా ...

నువ్వు నా కనుల ముందు నుంచి కదిలిన క్షణం నుండీ
నా చూపు నీ వెంటే పరిగెడుతూ వస్తుంది
నువ్వు కనుచూపు మేరలో ఉన్నంతవరకు.

ఆ పైన నాలో ఒకటే అలజడి
ఏదో తొందర, అంతా గడబిడ
కనురెప్ప వేయటం కూడా మరచి,
నువ్వు వెళ్ళిన దారివైపే చూస్తూ ఎదురుచూపు ...
నువ్వు తిరిగి వచ్చేంతవరకు.

ఇది అంతా నీ కోసం కాదులే ...
నీకోసమే పరితపించే నా మనసుకోసం

ఇట్లు,
నీ బాలు ౨౦.౦౭.౨౦౦౭, పగలు ౩.౧౦

నేను

చీమ ఒళ్ళు విరుచుకున్నా భయంకర శబ్దం వినిపించే
మహా నిశబ్దం నేను
మహా ప్రళయాల చెవులు చిల్లులుపడే
భయంకర నాదం నేను

చిరునవ్వులు కురిపించే సంతోషాన్ని నేను
అయినా, అప్పుడప్పుడూ బాధగా ఉంటాను

సరదాలను నేను, సంగీతాన్ని నేను
హుషారు నేను, అయినా దిగులుగా నేను

చైతన్యాన్ని నేను, జడత్వాన్ని నేను
కాంతిపుంజాల రూపం నేను,
అయినా అప్పుడప్పుడూ చీకటిలో ఉండిపోతాను

ఉరకలెత్తే సెలయేటిని నేను, అప్పుడప్పుడూ సొమ్మసిల్లిపోతుంటాను
ప్రేమను పంచుతుంటాను, వేదనని నాలోనే దిగమింగుతుంటాను
పరిమళల పూలవనం నేను, మోడును నేను
కోకిల పాటను నేను, గార్ధబ గానం నేను
మాటను నేను, మౌనం నేను

గగనమంత విశాలంగా నేను, అణువంత ఇరుకుగా నేను
తీరాల అలల తాకిడి నేను, సముద్రగర్భాన నిశ్చలం నేను

జీవం నేను
మరణం నేను


ఇట్లు,
నీ బాలు. ౨౧/౯/౦౭, సాయంత్రం ౬.౫౨