November 08, 2008

స్మృతి

నా స్మృతి పధంలోని ప్రతి మలుపులో
నీవే ఎదురై, అడ్డుపడుతుంటావు
ఏ పనీ చేయనీకుండా అడ్డుకుంటావు

నీకిది భావ్యమా అని అడుగుతుంటే,
అదోలా చూస్తావు నా కళ్ళలోకి . . . .
నన్ను తోసివేస్తావు నీ జ్ఞాపకాల అగాధాలలోకి.
ఇట్లు,
నేను
(నీ జ్ఞాపకాల అగాధాల లోతుల నుంచి)

August 09, 2008

వానకి ఓ వందనం

రెండు రోజులుగా,
జోరు జోరుగా వాన - హొరు హొరున వాన

ఊరంతా వాగులయ్యేంతగా వాన
వరదలా ఉప్పొంగిన వాన

వానా వానా, ముంచెత్తే వానా
చినుకు పడితే చాలు చిత్తడైపోయే మా ఊరిలోన
చెలరేగిపోయాతావెందుకే వానా

నెలల తరబడి ముఖం చాటేస్తావే వానా
ఆకలి మంటలు రగిలిస్తావే వానా
జాలి లేదా నీకు వానా

వస్తేనేమో,
వాగు వంకలు నింపి, నదుల గట్లు తెంపి
ఊళ్ళే మింగేస్తావు వానా - అంత ఆకలా నీకు వానా

నువ్వు లేకుంటే, తినగ మెతుకుండదే వానా
నువ్వు వస్తే, అడుగు బయటపెట్టే వీలుండదే వానా
ఇలా, అతి చేస్తావెందుకే మతిలేని దానా
నీ రూపు నాజూకు వానా, కానీ
నీకు హృదయమే లేదు కాబోలు వానా

(ఇలా అన్నానని ఏమీ అనుకోకే వానా ... మరి నిన్నా, ఈరోజు ఏక ధాటిగా కురిసి, నువ్వు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టావుగా, అందుకని కోపమొచ్చి అలా రాసాను.)
ఇట్లు,
నీ నేను
హైదరాబాద్
Aug 9th, 2008

July 27, 2008

ఏమి మాయ చేసావో ...

నా గుండె సవ్వడి
నాలోని అలజడి
మునుపెన్నడు లేదిది
నాకంతా వింతగా ఉన్నది

ఎప్పుడు తూరుపు తెలవారిందో
ఎప్పుడు ఆకాశం నల్లరంగు పులుముకుందో

పగలేదో, రేయేదో
తెలియకనే రోజు గడిచిపోతున్నది
ఏమి మాయ చేసావో ...

నిద్దురలో కలలా కమ్ముకుంటావు
పగలైతే అంతా నీవై కనపడతావు
కల ఏదో, నిజమేదో తెలియకుండా చేసావు

నీతలపుల చినుకులలో నన్ను తడిపివేసావు

July 14, 2008

వయ్యారి జుట్టు

ప్రతి అమ్మాయి తన జుట్టు గురించి బహుశా ఇలాగే అనుకుంటుందేమో ...

నిగనిగల జుట్టు, నల్లని జుట్టు
వయ్యారాల జుట్టు, వగలుపోవు జుట్టు
*************************
నిద్దురలో మెత్తగా నా మోమును కౌగిలించుకునే జుట్టు
చిక్కుపడి చికాకు పెట్టు ఈ జుట్టు
*************************
తలస్నానం చేస్తే త్వరగా తడి ఆరని జుట్టు
తడిగా ముడి వేస్తే తలనొప్పి ఈ జుట్టు
***************************
అద్దం ముందు నిలబడి ముస్తాబు అయ్యేవేళ
ఈ అందం నావల్లనే అంటూ గుసగుసలాడు జుట్టు
********************************
మూడు పాయలు చేసి ముచ్చటగ జెడవేసుకొను జుట్టు
పూలు సిగలో తురుమ బహు సుందరం నాజుట్టు
********************************
జడగంటలు పెట్టుకుని సందడిగా తిరుగుతుంటే
'ఎవరీ అపరంజి బొమ్మ ' అని అందరూ అంటుంటే
మురిసి మురిపెంగా నేను ముద్దు చేయు నా జుట్టు
**********************************
చిరుగాలితో సయ్యాట ఈ జుట్టు
నా నడకతో నాట్యమాడు నా జుట్టు
*********************************
నిగనిగల జుట్టు, నల్లని జుట్టు
వయ్యారాల జుట్టు, వగలుపోవు నాజుట్టు
---------------------------------------------
Photoes: Courtesy - Baapu garu

July 05, 2008

పుడమి

ఈ ప్రపంచమంతా నీ ఒడి
ఏమని వర్ణించను నీ ఒరవడి

విశ్వంలో మానవ జాతికి నీవే దిక్కు
నువ్వు కాదంటే మాకు పెద్ద చిక్కు

ఏ తల్లి కన్నదో, ఎవ్వరిమో మేము
ఏ ఆత్మ లోకాలనుండి వచ్చామో
ఏ అనంత దూరాలకి పోతామో, కానీ
నీ ఆదరణ మాత్రం మరువలేనిది

నీ పైకి రావడం జననం
నిను విడిచి పోవటం మరణం

June 26, 2008

హాయ్

హాయ్,
హాయ్ అంటూ పలకరిద్దాం, హాయ్
హాయ్ అంటూ పలకరిస్తే ఎంతో హాయి

హాయ్ హాయ్ హాయ్
హాయి హాయిగా హాయ్

వెనుతిరిగి చూసేది లేదోయి
మునుముందుకే సాగాలోయి

June 21, 2008

పాట

తల్లిపాడే జోల పాట

ప్రియురాలి ప్రేమ పాట

గాలివేసే ఈల పాట

ఆకాశాన హరివిల్లు పాట

వాన పాడే చినుకు పాట

మౌనం నా మనసు పాట

June 18, 2008

ప్రకృతీ...

ప్రకృతీ,
ఉదయించే సూర్యుడు నీ నుదుట కుంకుమబొట్టు
పచ్చని పైర్లు నీ చీరకట్టు

నీ నవ్వులే గాలి తెమ్మెరలు
పలకరింపులే వాన చినుకులు

నీ రుసరుసలు వడగాల్పులు
హుంకారాలు మేఘగర్జనలు

నీ నాట్యం నదీజలాల పరవళ్ళైతే
తాండవం మమ్ము ముంచ్చెత్తే వరదలు

మమ్మల్ని లాలిస్తావు, పాలిస్తావు
అన్నీ అందిస్తావు

మా అల్లర్లు భరిస్తావు
అపచారాలు సహిస్తావు

అప్పుడప్పుడు మాత్రం ఆగ్రహిస్తావు
నీదైన శైలిలో హెచ్చరిస్తావు
హద్దు మీరితే శిక్షిస్తావు

నీ శాంతం సుందర ప్రణయ చిత్రం
నీ క్రోధం ప్రళయాల ఘట్టం

May 15, 2008

వెలుగు రేఖలు వెళ్ళిపోయాక
రేయి చీకట్లు కమ్ముకున్నాక
మా దేశం వచ్చాడు చందమామ

మబ్బు తెరలను చీల్చుకుంటూ
మా ఊరు వచ్చాడు చందమామ
మా ఇంటికి వచ్చాడు మా చందమామ

చుక్కలని తెచ్చాడు చందమామ
మా ముంగిట ముగ్గులే వేసాడు చందమామ

ఊసులు చెప్పాడు చందమామ
హాయి ఊయల ఊపాడు చందమామ

పాటలు పాడాడు చందమామ
పొలం గట్లపైన ఆటలే ఆడాడు చందమామ

కొలనులో ఈదాడు చందమామ
కలువ పూవులు ఇచ్చాడు చందమామ

(మేము ఇద్దరం మంచి స్నేహితులం అయిపోయాము)

ఉషోదయం వేళ,
వేడి తాళలేను అన్నాడు చల్లని మామ
వెళ్ళొస్తాను అన్నాడు చందమామ
వెళ్ళి పోయాడు చందమామ

February 22, 2008